వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న పిలుపు తిరుపతిలో ముగిసింది. జగన్ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నపిలుపు నకు హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి 12రూపాయలకు కొన్న కేజీ మామిడిని హైదరాబాద్‌లో రూ. 60-70 మధ్య అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇంత తేడా ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఈ అంశం గురించి తాను ప్రస్తావించానని, ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు గల్లా, ఆదికేశవులు కుటుంబానికి చెందిన శ్రీని ఫుడ్స్, పక్కనే హెరిటేజ్ ఫుడ్స్.. ఇవన్నీ కూడా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇలా చేస్తే.. ఇక రైతులకు ఎలా మద్దతు ధర వస్తుంది. ఈ సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్ అయ్యాడు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు ఆయనే కొనుగోలు చేసి.. నాలుగు రెట్లకు ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. నాన్న హయాంలో రైతులకు లభించిన ధరలు మీ అందరికీ తెలుసు. ఆయన బాటలో రూ. 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నాం. పంటవేసే ముందు ధరను నిర్ణయిస్తాం. ప్రభుత్వ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తాం. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో అంతా పక్షపాతమేనని ఐరాలకు చెందిన చలపతి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఫ్యాక్టరీల యజమానులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఫ్యాక్టరీ యజమానులు జట్టుగా మారిపోయారు. పచ్చ చొక్కాలకే లబ్ది చేకూరుస్తున్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. ఆయన చేసిన ప్రమాణానికి అర్థం లేకపోయింది. ప్రజల కష్టాలు అర్థం చేసుకుని వైఎస్ జగన్ నవరత్నాలు ప్రకటిస్తే.. ఇప్పుడు వాటిని కూడా దొంగిలిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ సమస్యను మీలో ఒకడిగా ఉండి ఆలోచించి పరిష్కారం చేస్తానని జగన్ అన్నారు.
