కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి తాజా నిదర్శనం ఇది. తమ మాటే నెగ్గాలనే తత్వానికి నిదర్శనం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది.
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ యాత్ర సినిమాపై స్పందించడమే కాకుండా..హెచ్చరించారు! రెండు తెలుగు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు మరియు పార్టీ ఆఫీస్ బేరర్లకు సినిమా చూపించి వారు అభ్యంతరాలు లేవనెత్తకుంటేనే సినిమా విడుదల చేయాలని మానవతా రాయ్ ఆర్డర్ వేశారు. యాత్ర సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లను కించపరస్తే సినిమాకి తెలంగాణలో నిరసనలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే సంభాషణలు, దృశ్యాలను తొలగించకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నేతలను కించపరిచేలా యాత్ర సినిమాలో సన్నివేశాలుంటే.. సినిమా ప్రదర్శించే థియేటర్ల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతారన్నారు.
వైఎస్ఆర్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి విధేయుడిగా ఉన్నారని.. అలాంటి మహానేత చరిత్రను, కాంగ్రెస్ విధేయతను, ఆయన వ్యక్తిత్వాన్ని వక్రీకరిస్తే నిర్మాత, దర్శకులకి తగురీతిలో బుద్ది చెబుతాం అని మానవతా రాయ్ అన్నారు. యాత్ర సినిమాలోని అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే సినిమా విడుదల చేయాలని హైద్రాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు రేపు పిర్యాదు చేస్తామన్నారు.