రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగడలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం అమలు అయ్యేపని కాదని నిపుణలు స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ఉపయోగపడనుందని పియూష్ గోయల్ వెల్లడించారు.
అయితే, ఈ పథకంపై దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు పెదవి విరుస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్కే పొద్దార్ మాట్లాడుతూ “దీని అమలుకు రూ.75 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. అయితే ఈ రూ.6 వేలు సరిపోతాయా లేదా అన్నది పక్కన పెడితే.. దీని అమలు మాత్రం చాలా కష్టం. దీనికి న్యాయపరమైన చిక్కులు తప్పవు. భూయాజమాన్య హక్కులపై ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పథకం అమలుకు అడ్డంకిగా మారవచ్చు“ అని స్పష్టం చేశారు. “టైటిల్ డీడ్‌లో ఒకరి పేరున్నంత మాత్రాన ఆ భూమిపై యాజమాన్య హక్కులు అతనికే దక్కవని, న్యాయపరమైన పోరాటంలో ఇతరులు కూడా యాజమాన్య హక్కుల కోసం పోరాడవచ్చని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ లెక్కన ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే.. అందరూ ఆ రూ.6 వేల సాయం అందుకుంటారని పొద్దార్ చెప్పారు. అందువల్ల మొదటి విడత సాయం రూ.2 వేలు ఇవ్వడం కూడా ఓ సవాలే“ అని పొద్దార్ తేల్చిచెప్పారు.
జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ సైకత్ సిన్హా రాయ్ మాట్లాడుతూ “రూ.75 వేల కోట్ల మొత్తం ఇలా పంచితే వృథాగా పోయినట్లే “ అని అభిప్రాయపడ్డారు. ఇదే మొత్తాన్ని పెట్టుబడి సాయంగా లేదా మంచి ధరలు కల్పించడానికి ఉపయోగించవచ్చని, దీని ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉండేదని ఆయన చెప్పారు. దీని కారణంగా ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే ఆ భూమికి సంబంధించి ఎక్కువ మందికి ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి కలుగుతుందని రాయ్ తెలిపారు.