క్షణం క్షణం ఉత్కంఠతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేశాయి కర్ణాటకలోని రాజకీయ పరిణామాలు గత ఏడాది చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి శిబిరాలు, సమావేశాలు, ప్రలోభాలు, ప్యాకేజీలు, ఆఫర్లు, ఆడియో టేప్‌లు లీక్… ఒక్కటేంటి ఇలా ప్రతీ క్షణం ఉత్కంఠే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రంగంలోకి దిగి జేడీఎస్-కాంగ్రెస్ కూటమి నాయకుడి కర్ణాటక సీఎంగా జేడీఎస్ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయించారు. తద్వారా ట్రబుల్ షూటల్ అనిపించుకున్నారు.
అయితే, ఆ ట్రబుల్ షూటర్ తాజాగా ట్రబుల్‌లో పడ్డారు. కర్ణాటకలో కీలక మంత్రిగా పనిచేస్తున్న డీకే శివకుమార్ తో పాటు ఆయన అనుచరులు ఐదుగురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్రమ నగదు బదిలీకి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ను ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ తో పాటు ఈడీ గతంలో విచారించింది. మంత్రితో పాటు సచిన్ నారాయణ, సునీల్ శర్మ, ఆంజనేయ, రాజేంద్రలకు నోటీసులు జారీ చేశాయి. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 17న ఈడీ సమన్లు జారీచేసింది. ఇవి జారీ ఆయి 15 రోజులు దాటిన నేపధ్యంలో ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని కథనాలు వస్తున్నాయి.
కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు తోడుగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్, కర్ణాటక ఎన్నికల్లో చక్రం తిప్పిన డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగి వ్యూహాలు పన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజానికం గులాబీ పార్టీకే పట్టం కట్టారు.