తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్దా నాయక్ తెలిపారు. వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నించడం పట్ల చెవిరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకుని, ఇది టీడీపీ కార్యక్రమం అని టీడీపీ నేతలు మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంలో చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడితో దాడి చేశారు. ఈ ఘటన పట్ల వైసీపీ నేతలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పాలనలో ఎవరికీ రక్షణ లేదని బాబు పోవాలంటున్నారు.