దళిత సంక్షేమంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నిలువనీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతీపథకం ప్రజలకు మేలు చేసిందని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక దళితులు పదేళ్లు వెనక్కివెళ్లిపోయారన్నారు. దళితుల్లో ఎవరు పుడతారని హేళనగా చంద్రబాబు మాట్లాడారన్నారు. దళితులను అవమానించిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.
దళితులపై దాడులు పెగిరిపోయాయన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు దళితులను మురికివాళ్లని మాట్లాడారన్నారు. రాష్ట్రంలో దళితులకు రాజ్యంగా బద్ధంగా రావాల్సిన వాటా దక్కట్లేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నామని చెప్పడం దుర్మార్గమన్నారు. మీరు వేసే ప్రతీరోడ్డులో వైయస్ చెమట చుక్కలున్నాయని గుర్తించాలన్నారు. సబ్ ప్లాన్ నిధులు 60 శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. దళితుల సొమ్ము అన్యాక్రాంతం చేస్తున్నారని ఆగ్రహించారు. దళితులకు బడ్జెట్‌లో ఒక్కపైసా కూడా పెంచలేదన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. దళిత వ్యతిరేక చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని నాగార్జున హెచ్చరించారు.