వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా మేధావులు, తటస్థులతో హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. తటస్థులకు లేఖలు రాసి, వారితో భేటీ కావాలని సూచించారు. మొత్తం 70వేల మంది తటస్థులకు లేఖలు రాసి న్యూట్రల్‌గా ఉన్న విద్యార్థులు, మేధావులు, డాక్టర్లతో నిన్న భేటీ అయ్యారు. కేంద్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని, వచ్చే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం లేదని చెప్పారు. హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. చట్టం ప్రకారం విశాఖపట్నంకు రైల్వే జోన్ రావాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు రైల్వే జోన్ ఉందని అలాగే ఆంధ్రప్రదేశ్‌కు జోన్ కోసం పోరాటం చేద్దామన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మోసపోతామని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు.
చంద్రబాబు నవరత్నాలు పథకాలను కాపీ కొడుతున్నారని, ఎంత కాపీ కొట్టినా ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రతీ జిల్లాలో కూడా అన్న పిలుపులో భాగంగా తటస్థులను కలుస్తానని, ప్రతి కులానికి తాము కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రంలో కూడా ఇప్పుడే ఏ పార్టీతోను వెళ్లమని చెప్పారు. ప్రత్యేక హోదా ఫైల్ పైన ఎవరు సంతకం పెడతామంటే వారికి మద్దతిస్తామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్‌తో పాటు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని అన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామనే మాటకు తాను కట్టుబడి ఉన్నానని.. రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేటట్లు చూస్తామని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతి 50 కుటుంబాలకు రూ.5వేల జీతంతో ఒకరిని నియమించి, ఏ పథకం అయినా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేస్తామని తెలిపారు.