గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంలో సీఎం చంద్రబాబు నాయుడు పాపం కూడా ఉందని విమర్శించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆపార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం నినదించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ఏపీకి చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీకి చేసిన న్యాయానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
బందుల వల్ల రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని గతంలో చంద్రబాబు ప్రకటనలు చేశారని.. కానీ ఈరోజు చంద్రబాబు బందుకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈవీఎంలు వద్దని చంద్రబాబు కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏ పార్టీ కూడా తిరిగి బ్యాలెట్లు కావాలని కోరలేదని, ఓటింగ్‌శాతం తక్కువగా ఉన్నప్పుడు అనుమానాలు కలిగినప్పుడే మాత్రమే వీవీప్యాట్‌ల
స్లిప్పులను లెక్కించాలని కోరారని తెలిపారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలపై ఎందుకు పోరాటం చేయలేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.