అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి అవస్థలు పడుతున్న విద్యార్థుల అంశం అనేకమంది తల్లిదండ్రులను కలచివేస్తున్న సంగతి తెలిసిందే. తమ పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో తెలుసుకునేందుకు అనేకమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్య సహా పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చేయాలని ఆయన కోరారు. అమెరికాతో భారతదేశం సంబంధాలు, ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు సహా ఇతర అంశాలపై ఈ సందర్భంగా కేటీఆర్, కేథరిన్ హడ్డా చర్చించారు. ఈ సమావేశం అనంతరం కేథరిన్ హడ్డా ఓ ట్వీట్ చేస్తూ ‘కేటీఆర్ వంటి మంచి మిత్రుడితో సమావేశం అవడం ఎల్లప్పుడు విశేషంగా భావిస్తుంటాం. అమెరికా- తెలంగాణ కలిసి పనిచేసే అనేక అంశాలపై మేం చర్చించాం. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఆయన పూర్తిగా అర్హుడు’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాథరిన్ హడ్డా ట్వీట్ అనంతరం కేటీఆర్ స్పందిస్తూ ‘కాథరిన్ హడ్డ మిమ్మల్ని కలవడం సంతోషకరం. అమెరికా-భారతదేశం సంబంధాల మధ్య బంధం బలోపేతానికి సంబంధించి అనేక అంశాలు చర్చించడం సంతోషకరం. ఈ సమావేశంలో మనం చర్చించినట్లే అమెరికాలో చిక్కుకుపోయిన విద్యార్థుల సమస్యల పరిష్కార అంశాన్ని మీరు సంబంధిత అధికారులకు చేరవేస్తారని భావిస్తున్నాం’ అని హర్షం వ్యక్తం చేశారు.
Pleasure meeting with you Kathy. Glad to have covered a wide gamut of US-India relations & with Telangana in particular
As discussed, I hope you could convey our request on behalf of the students from Telugu states who are engulfed in a situation in the US https://t.co/3UNzuKvN9m
— KTR (@KTRTRS) February 1, 2019