తెలంగాణ రైతులకు మాత్రమే దక్కిన అవకాశం ఇది. ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ చేసిన కృషి షలితంగా దేశవ్యాప్తంగా మరెవ్వరికీ దక్కని అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లో ఈ డబ్బు జమ కానుంది.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులకు శుభవార్తే అయినా.. తెలంగాణ రైతులకు మాత్రం ఇది పండుగేనని అంటున్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన రైతు పథకం వల్ల తెలంగాణ రైతులు మరింత లబ్ది పొందనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కింద రెండు వాయిదాల్లో 10వేల రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో 6వేల రూపాయలు ఇవ్వనుంది. ఈ లెక్కన 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న తెలంగాణ రైతులు.. సంవత్సరానికి రూ.16వేలు తీసుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 10వేలు ఇస్తే.. కిసాన్ సమ్మాన్ నిధి కింద మరో 6వేలు. తెలంగాణ రైతులు నిజంగా అదృష్టవంతులు అంటున్నారు.