ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని మాణిక్యాలరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్ధం కావట్లేదన్నారు.
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గల నియోజకవర్గాలకు నిధులు నిలుపుదల చేస్తోందన్నారు. దేశంలో రాష్ట్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన తెలిపారు. చందబ్రాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతుంటే తాము చాలా బాధపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదన్నారు. తమది నిజమైన రోషమని, చంద్రబాబు మాదిరిగా మాటలు మార్చలేమన్నారు.