ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు బంధువులు వైసీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బుద్ధా వెంకన్న మైక్ పడితే వైసీపీ మీద తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన సోదరుడే వైసీపీలో చేరడం ఇటు బుద్ధా వెంకన్నకి, అటు టీడీపీకి షాక్ అనే చెప్పాలి. గతంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లాలో కలిసిన బుద్ధా నాగేశ్వరరావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని వైసీపీలో చేరానన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేసారు. బుద్ధా వెంకన్న లాంటి ఫైర్ బ్రాండ్ నేత సోదరుడు వైసీపీలో చేరడం టీడీపీకి ఝలక్ అనే చెప్పాలి. అలాగే ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు, టీడీపీపై ఎవరైనా విమర్శలు చేస్తే ప్రతిగా వారిపై కయ్యానికి కాలుదువ్వే నేత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అలాగే సోమిరెడ్డి సోదరి భర్త కేతిరెడ్డి రామకోటారెడ్డి, ఆయన కుమారులు తాజాగా వైసీపీ అధినేత జగన్ ని కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే సోమిరెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని నువ్వు మంత్రి పదవి చేపట్టడానికి సిగ్గులేదా అని వైసీపీ నేతలు భహిరంగ విమర్శలే చేశారు.
ఇప్పుడు సొంత బావ పార్టీ మారాడు కాబట్టి.. నిన్ను నీ మాటలను ఇంట్లో వాళ్లే నమ్మట్లేదు, సొంత ఓట్లే వేయించుకోలేని నీవు ఇక పోటీ చేసి గెలుస్తావా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు సిట్టింగ్ అండ్ మాజీ నేతలు వైసీపీలో చేరగా తాజాగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలో పెద్ద కలకలమే రేపింది. వర్ల రత్నం విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు బీసీ నేత కూరాడ నాగేశ్వరరావు కూడా వైసీపీలో చేరడం విజయవాడ రాజకీయవర్గాల్లో పెద్ద హాట్ అవుతోంది.
వర్ల రత్నం కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇలాంటి కీలక నేత సోదరుడు, పార్టీలో కీలకంగా పని చేసిన రత్నం వైసీపీలోకి వెళ్తుండటం గమనార్హం. బీసీలకు చంద్రబాబు హయాంలో అన్యాయం జరుగుతోందని, జగన్ తో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేతల కుటుంబ సభ్యులే వైసీపీకి తీర్ధం పుచ్చుకోవడం, మరోవైపు ప్రతీ సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం కనిపిస్తుండడం పట్ల టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పేలా లేదు.