నాలుగు సంవత్సరాల పాటు కేంద్రంలోని బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి…తనపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో పొత్తకు బైబై చెప్పేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కొత్త స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేయాలనే నిర్ణయానికి వచ్చానని ఆయన ప్రకటించారు.
అయితే, చంద్రబాబు ప్రచార డ్రామాపై అదే పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా గాలి తీసేశారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయడం వల్ల ఉపయోగం ఉండదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏదో ప్రయత్నం చేయాలని చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు విషయం తనకు తెలియదని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని వ్యాఖ్యానించారు. ఎవరైనా టీడీపీతో జతకట్టవచ్చని, ఆఖరి నిమిషం వరుకూ ఏదైనా జరగవచ్చని స్పష్టం చేశారు. అమరావతి, కియా కార్లను మేమే తీసుకువచ్చామని బీజేపీ నాయకులు ఎన్ని గొప్పలైనా చెబుతారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ కియా పరిశ్రమను గుజరాత్ కు తరలించేందుకు నాలుగు సార్లు ప్రయత్నించారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.