రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. జనవరిలో దేశవ్యాప్తంగా జరిపిన సర్వే వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇందులో వైసీపీ హవా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. మొత్తం ఓట్లలో 49.5 శాతం ఓట్లను వైఎస్ఆర్ సీపీ సాధించనున్నదని, టీడీపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 2.6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ 10 సీట్లకు పైగా సాధించి తన హవాను కొనసాగించే అవకాశం ఉందని ఆ సర్వేలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉండనుందని స్పష్టమవుతోంది.
కేంద్రంలో జగన్ చక్రం తిప్పనున్నారని అంచనా వేసింది. ఊహించని రీతిలో ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంటుందని తెలిపింది. అసెంబ్లీ స్థానాలతో పాటు ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి? అనే అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరిచే ఛాన్స్ లేదని తెలిపింది. గత 2014లో టీడీపీ 15 స్థానాలను సొంతం చేసుకోగా.. వైసీపీ 8స్థానాలను, బీజేపీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచుకోవాలని చూస్తుండగా.. ఆ పార్టీకి 10 స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్‌లో అభిప్రాయపడింది. మొత్తమ్మీద జగన్ కేసీఆర్ లు కేంద్రంలో చక్రం తిప్పనున్నారని స్పష్టమవుతోంది.