ఏపీలో ఎన్నికల ముహుర్తం సమీపిస్తున్న వేళ రాజకీయాలు కాక మీదకు చేరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వారు కూడా ఇందులో క్రియాశీలంగా పాల్పడుతున్నారు. టీవీ, సినిమా నటుడిగా ఇటీవల బిజీగా ఉన్నప్పటికీ నటుడు నాగబాబు రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఓ ఛానల్ ద్వారా తన భావాలు పంచుకుంటున్న నాగబాబు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై గళం విప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ “ఈరోజు భారత దేశం మొత్తం మీద ఒకసారి చూస్తే.. అవినీతిలో కానీ.. అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. `చంద్రబాబు చేసిన ఈ ప్రకటనలో ఒక నిజం ఉంది.. ఒక అబద్ధం ఉంది చెప్పుకోండి చూద్దాం` అంటూ ఈ డైలాగ్ పై నాగబాబు ప్రజలకు సవాల్ విసిరారు. ఒకవేళ సమాధానం తెలియకపోతే…తానే చెప్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు.
ఇదే వీడియోలో సమాధానం కూడా నాగబాబు ఇచ్చేశారు. “అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అన్నది నిజం. అభివృద్ధిలో నంబర్ 1 అనేది అబద్ధం’ అంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఇంతకంటే గొప్పగా పొడుపు కథలు వేసేవారు.. నిజాయితీగా చెప్పేవారు ఎవరుంటారు? అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.