దేశం కాని దేశం..ఏజెంట్ చేతిలో మోసం…స్వగ్రామానికి చేరేందుకు ఆశలు లేవు…తినడానికి తిండిలేదు…ఉండటానికి స్థలం లేదు…ఇది ఇరాక్‌లో చిక్కుకుపోయిన 17 మంది బాధితుల స్థితి. జీవితంపై ఆశలు వదులుకున్న సమయంలో వారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తమ వ్యథను పేర్కొంటూ కాపాడాలని విన్నవించారు. దీంతో ఎంపీ కవిత రంగంలోకి దిగి…భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పొందడంతోపాటు ఇరాక్‌లో ఇక్కట్ల నుంచి విముక్తి చేసే వరకు నిరంతరం శ్రమించారు. ఎంపీ కవిత విశేష కృషి ఫలితంగా బాధితులు తమ కుటుంబసభ్యులను కలుసుకోనున్నారు.
వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లాకు చెందిన కాటం మహేందర్‌రెడ్డి, వేల్పూర్ రాజేందర్, దారెడ్డి రాజు, లాడె రాజేందర్, కాటం లక్ష్మణ్, మెల్ల ప్రభాకర్, గుండ్ల భూమేశ్వర్, గానోజి కృషాంకర్, శ్రీరాం లింబాద్రి, పుల్లా సాయన్న, గొల్ల గంగన్న, అలూర్ గంగారెడ్డి, కొర్రా రవీందర్, బానోత్ చతుర్‌సింగ్, బానోత్ వినోద్ ఇరాక్‌లోని ఎర్బిల్ నగరానికి ఉపాధికోసం వెళ్లారు. వారిని ఏజెంట్ మోసంచేశాడు. సరైన అనుమతులు, ఉద్యోగ ప్రక్రియ లేకపోవడంతో వసతి, భోజనం కోసం బాధితులు ఇక్కట్లు పడ్డారు. తమ ఆవేదనను ఎంపీ కవితకు తెలియజేశారు.

దేశంకాని దేశంలో ఇక్కట్లు పడుతున్న వారికి సహాయం చేసేందుకు, వారిని స్వదేశానికి రప్పించేందుకు ఎంపీ కవిత రంగంలోకి దిగారు. కేంద్ర విదేశాంగశాఖ, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై వ్యవహారాలశాఖతో సమన్వయం చేసుకొని ఇరాక్ రాయబార కార్యాలయంతో సంప్రదించి బాధితులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ఎంపీ కవిత పూర్తిచేశారు. తదుపరి దశలో వారికి ఎర్బిల్ నుంచి ఢిల్లీ వచ్చేందుకు విమాన టికెట్లు, అక్కడి నుంచి స్వగ్రామానికి చేరేందుకు రైలు టికెట్లు ఏర్పాటుచేశారు. బాధితులు మంగళవారం తమ స్వగ్రామానికి చేరుకోనున్నారు. ఎంపీ కవిత చొరవతో బాధితుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. తమ వ్యధను తక్షణం పరిష్కరించారని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.