ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు కృతజ్ఞత తెలిపేందుకు సోమవారం రాయ్‌పూర్‌లో నిర్వహించిన కిసాన్ అబ్‌హార్ సమ్మేళన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి పేదవాడికీ కనీస ఆదాయం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైతే కనీస ఆదాయ హామీని అమలుపరుస్తాం. దీని ద్వారా దేశంలోని ప్రతి పేదవాడు కనీస ఆదాయాన్ని పొందుతారు. ఇక దేశంలో ఆకలి, పేదరికం ఉండబోదు అని రాహుల్ పేర్కొన్నారు.
అయితే, ఈ హామీని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తప్పుబట్టారు. ఇవాళ లక్నోలో మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు కనీస ఆదాయ కల్పిస్తామన్న వాగ్దానం అబద్ధమే అని పేర్కొన్నారు. కనీస ఆదాయం కల్పిస్తామనేది.. కాంగ్రెస్ గరీభ్ హఠావో, బ్లాక్ మనీని తీసుకొచ్చి పేదల అకౌంట్లలో జమ చేస్తామని బీజేపీ ఇచ్చిన అబద్దపు వాగ్దానం లాంటిదే అని స్పష్టం చేశారు. రూపాయి నాణేనికి కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్శాలు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని మాయావతి మండిపడ్డారు.