రాజధానికి గుండెకాయలాంటి నియోజకవర్గం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం.. ఎస్సీ రిజర్వ్డ్ అయిన తాడికొండలో తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఉన్నాయి. మాజీ మంత్రి పుష్పరాజ్, తిరువైపాటి వెంకయ్య, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తెనాలి శ్రవణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి కత్తెర హెన్రీ క్రిస్టియానాపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజధాని ప్రాంతంలో అంతర్భాగం కాబట్టి ఇక్కడ భూముల రేట్లు పెరిగాయి. స్థానిక యువతకే కాకుండా ఎంతో మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయి.
మేడికొండూరు రాజధాని ఎఫెక్ట్ తో ఓ మోస్తరుగా అభివృద్ధి చెందుతుండగా ఫిరంగిపురం మండలంలో మాత్రం అభివృద్ధి, రాజధాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఇక పార్టీ పరంగా చూస్తే ఎమ్మెల్యేగా గెలిచిన తెనాలి శ్రావణ్ కుమార్ పై పార్టీ పొమ్మనలేక పొగ పెడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలు శ్రవణ్ ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఇటీవల శ్రావణ్ కుమార్‌ను వ్యతిరేకిస్తూ బహిరంగ సమావేశాలు సైతం పెట్టారు. నాలుగు మండలాల్లో రాజకీయ సమీకరణలు పరిశీలిస్తే తుళ్లరు తాడికొండ మండలాల్లో రాజధాని ప్రభావం, టీడీపీని సమర్థించే కమ్మ సామాజికవర్గం బలంగా ఉండడంతో ఆ రెండు మండలాల్లో టీడీపీ బలంగా కనిపిస్తోంది. మేడికొండూరులో సైతం నువ్వా నేనా అన్నట్టుగా ఉంటూ వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. ఫిరంగిపురం మండలంలో మాత్రం వైసీపీకి ఆధిక్యత కనిపిస్తోంది.
ఏదేమైన వైసీపీ అభ్యర్థి ఎంపికలోనే కాస్త ఇక్కడ క్లారిటీ రాలేదు. ఈ నేపధ్యంలో వైసీపీ తరపున వచ్చే కొత్త అభ్యర్థి జనాల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల వేళ స్ట్రాంగ్‌గా ఉన్నా టీడీపీకి పోటీ ఇవ్వలేరు అనే పరిస్థితులు ఉన్న నేపధ్యంలో స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేనే వైసీపీకి రానున్నారని తెలుస్తోంది. తాడికొండలో సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీని తట్టుకుని విజయం సాధించాలంటే అది ప్రస్తుత ఎమ్మెల్యే వల్లే అది సాధ్యమవడం, సదరు ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు రావడంతో తాడికొండలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది.