కాపులకు రిజర్వేషన్ అంశం మరోమారు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అవడంతో…తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కిర్లంపూడి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏమైనా అలజడులు లేకుండా, అనుమానిత వ్యక్తుల ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పర్యవేక్షిస్తున్నారు.
ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిని పోలీసులు జల్లెడ పడుతున్నారు.ముద్రగడ ఇంటి ముందు పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, గ్రామంలోకి కొత్తవారు ఎవరెవరు వస్తున్నారో చూసి , వారి వివరాలు తెలుసుకుంటూ పోలీసులు క్షుణ్ణంగా చెకింగ్ చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పోలీసులు చెకింగ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాపు ఉద్యమంతో మరల తమ గ్రామంలోకి పోలీసులు, చొరబడుతున్నరన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు, ఏ క్షణానికి ఏమి జరుగుతుందోనని ఆందోళన, చెందుతున్నారు.
కాగా, రేపు జరగబోయే మీటింగ్ లో ముద్రగడ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇదిలాఉండగా, జిల్లా ఎస్.పీ.విశాల్ గున్నీ మట్లాడుతూ ఇంతవరకు కాపు JAC నాయకులు 31 వ తేదీ సభకోసం ఇంతవరకు ఎటువంటి అనుమతులు అడగలేదని, ఒకవేళ అనుమతి కోరితే పరిశీలిస్తామని చెప్పారు. కాగా, ప్రభుత్వ చర్య కాపులను అణిచివేయడమేనని అంటున్నారు.