అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి వంచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాశేషు మండిపడ్డారు. ఇప్పటికి 260 మందిని పొట్టన పెట్టుకున్నా… చంద్రబాబులో కనీస కనవిప్పు లేకపోవడం పట్ల విస్మయం వక్తం చేశారు. విజయవాడ లోని పార్టీ అనుభంధసంఘాల కార్యాలయంలో కొఠారిశ్రీనివాసరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గం 250 కోట్లు ప్రకటించిన పిమ్మట మరో ముగ్గురు బాధితులు గుండె పోటుతో మృతి చెందిన విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఇవన్నీ సర్కారీ హత్యలుగానే అభివర్ణించారు.
ప్రభుత్వ పొంతన లేని ప్రకటనలపై విశ్వాసం కోల్పోయిన నేపధ్యంలోనే బాధితుల్లో ఆందోళన రెట్టింపైందని తెలిపారు. మంత్రివర్గం ప్రకటించిన 250 కోట్లు ఏ ప్రాతిపదికన బాధితులకు చెల్లిస్తారన్న దానిలో స్పష్టత లోపించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రతినిధిగా మర్యాదస్తుడి ముసుగులో కుటుంబరావు మీడియా సాక్షిగా ప్రకటించిన మేరకు 20వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులందరికి న్యాయం చేయాలంటే 1183 కోట్లు అవసరమని తెలిపారు.ఇది స్వయంగా CID తేల్చి చెప్పిన లెక్కని వివరించారు. మరి మంత్రివర్గం ప్రకటించిన 250 కోట్లు ఏ లెక్కన పంచుతారో సీఎం గారే సెలవియ్యాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గం భేటీ జరిగి ఇప్పటికి 6 రోజుల గడిచినా కనీసం వారు స్వయంగా ప్రకటించిన 250 కోట్లకు సంబందించిన విధివిధానాలను నిర్దేశించలేదని విమర్శించారు.దీన్ని బట్టే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న వాస్తవం తేటతెల్లం అవుతుందని ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే తాము స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
ఇకపై రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల మరణ ఘోష వినిపించడానికి విల్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తాము ప్రత్యక్ష కార్యచరణలోకి దిగనునట్లు వెల్లడించారు. ఈనెల 30న విజయవాడలో అగ్రిగోల్డ్ బాదితుల బాసటకమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అందులో భవిష్యత్ కార్యాచరణ నిర్ధేశించుకొని మరో పోరాటం నిర్వహిస్తామని ప్రకటించారు.మహిళలకు పదివేలు,స్మార్ట్ ఫోన్ లు ఇస్తామని చంద్రబాబుప్రకటించడం మరోమోసమని తెలిపారు.అదే విధంగా జయహో బిసి సభ ద్వారా చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బిసిలు ఆయనను నమ్మరని, నిజంగా ప్రజలకు మేలు చేయాలంటే వైఎస్సార్ మాదిరిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంతకాలు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.