గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. ఉదయం చిన్నారులను తీసుకుని పాఠశాలకు వెళుతుండగా కానుగవాగు కల్వర్టు వద్ద అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాద సమయంలో బస్‌లో 60 మంది చిన్నారులున్నారు. ఈ ఘటనలో 20మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. రాంగురూటులో వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. మండాది వాగు వద్ద ఎదురుగా వేరే వాహనం రావడంతో బస్సు డ్రైవర్ దానిని తప్పించబోయి పక్కకు తిప్పాడు. దీంతో బస్సు కల్వర్టు మీద నుంచి వాగులోకి పడింది. బస్సులోని 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద వైద్యులకు బదులు స్వీపర్లు కట్లు కట్టడంతో వైద్యులు చేయాల్సిన పనిని స్వీపర్ల చేత ఎలా చేయిస్తారంటూ విద్యార్థుల బంధువులు వాగ్వాదానికి దిగారు. క్షతగాత్రులను స్థానిక ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు.