సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న తెలంగా రాష్ట్ర సమితిపై ఉద్దేశపూర్వక వ్యతిరేకతే ప్రధాన అజెండాగా రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటైన తెలంగాణ జనసమితి అడ్రస్ గల్లంతు అయింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కోదండరాం అనంతరం కాంగ్రెస్-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జట్టుకట్టి బరిలో దిగినప్పటికీ…బొక్కాబోర్ల పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఖాతాలో మరో పరాజయం నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో అగ్గిపెట్టె పార్టీ అడ్రస్ గల్లంతు అయింది.
ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ కేటాయించిన తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగింది. వీటిలో నాలుగు అంబర్ పేట (నిజ్జన రమేష్), మల్కాజిగిరి (దిలీప్‌కుమార్), సిద్దిపేట (భవానీ రెడ్డి), వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ, మిగిలిన ఐదు దుబ్బాక (రాజ్‌కుమార్), వరంగల్ తూర్పు (గాదె ఇన్నయ్య), ఆసిఫాబాద్ (ఆత్రంసక్కు), మిర్యాలగూడ (విద్యాధర్‌రెడ్డి), మహబూబ్‌నగర్ (రాజేందర్‌రెడ్డి) స్థానాల్లో కాంగ్రెస్‌తో కలిసి `స్నేహపూర్వక` పోటీలో నిలిచింది. ఈ పోటీ దశలోనే రకరకాల చర్చలు వినిపించాయి. ఎనిమిది స్థానాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని టీజేఎస్ నేతలే వాపోయారు. తాము 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే నాలుగింటిలో సొంతంగానూ, మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్‌తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలవాల్సి వచ్చిందని అన్నారు.
అయితే, ఆ పార్టీకి ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది.ఆ పార్టీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందారు. ఏ నియోజకవర్గంలోనూ ప్రభావం చూపకలేకపోయారు. ఏ స్థానంలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు. దీంతో అగ్గిపెట్టె గుర్తు పార్టీ గల్లంతు అయ్యింది. అయితే, తెలంగాణ జన సమితి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటనుందని కోడందరాం మాస్టారు ప్రకటించారు. కానీ అలాంటి పరిస్థితి లేదని స్పష్టమైంది. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం కోదండరాం పార్టీ ఆఫీస్ వెలవెలబోతోంది.