తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరించొద్దంటూ ఈసీ ఆదేశించడం.. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ టూర్, యాగంతో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 30వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.. చండీయాగాన్ని కేసీఆర్ దిగ్విజయంగా నిర్వహించారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టిసారించారు. తాజాగా, కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది.
శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందు హాజరైన సీఎం కేసీఆర్ అనంతరం సీఎం గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలసేపు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రవల్లిలో నిర్వహించిన సహస్ర చండీయాగం గురించి గవర్నర్‌కు సీఎం వివరించగా.. కేసీఆర్‌ను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటివారంలోగా మంత్రివర్గాన్ని విస్తరిస్తామని సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 30, ఫిబ్రవరి 7వ తేదీలను గవర్నర్ దగ్గర ప్రస్తావించారని అంటున్నారు. బడ్జెట్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.