కదిరి సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన మాధవ్‌ను వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. ఆ కమిట్మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేస్తానని, అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. అయితే ఎక్కడి నుండి పోటికి దగుతారనే మరి కొన్ని రోజుల్లో తెలవనుంది. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి గోరంట్ల మాధవ్ పోలీసుల పవరేంటో చూపిస్తానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన సీఐ గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
