వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తన పాదయాత్రకు వచ్చిన స్పందనతో ఉత్సాహంగా ఉన్న జగన్… సమర శంఖారావం పేరుతో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. దీనికోసం వైసీపీ శ్రేణులు జిలాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి.జిల్లాల పర్యటనలో భాగంగా తొలి విడతగా ఫిబ్రవరి 4న తిరుపతిలో, 5న కడపలో, 6న అనంతపురంలో జగన్ పర్యటిస్తారు. దీనిలో భాగంగా బూత్ కమిటీల ప్రతినిధులు, క్రియాశీల ప్రతినిధులతో జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల నియామకం, ఎన్నికలకు సిద్ధం చేయడం వంటి విషయాలపై సమీక్షిస్తారు. జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశాలు నిర్వహించి, ఆ తర్వాత ‘అన్న కోసం’ పేరుతో మరో కార్యక్రమం చేపట్టాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. మూడు జిల్లాల పర్యటన తర్వాత రెండు మూడు వారాల గ్యాప్ తీసుకుని మిగతా జిల్లాల్లో పర్యటించాలని జగన్ నిర్ణయించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమ పార్టీకి ఓట్లుగా మార్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు
