భారత దేశ ప్రజా స్వామ్య చరిత్రలో ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎంతో సత్య నిష్ఠతో యజ్ఞ యాగాదులు చేసే మహా నాయకుడిగా ఇప్పటి వరకు ఒక్క కేసీఆర్ తప్ప ఎవరి పేరూ వినిపించలేదు. ఏం చేసినా ఒక తపో దీక్షతో పని చేయడం ఆయనకు మొదటి నుండీ వెన్నతో పెట్టిన విద్య . 2001 లో ఆయన తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒక చరిత్ర . తెలంగాణ మట్టి బిడ్డగా ఆయన నమోదు చేసినన్ని అద్భుత చారిత్రక విజయాలు ఎవరూ నమోదు చేయలేదు. మొదటి నుండి ఆయన చండీ మాత భక్తుడు. గతంలోనూ ఆయన చాలా సార్లు చండీయాగాలు నిర్వహించారు. అయితే మూడేళ్ళ క్రితం ఆయన ఇదే ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సుమారు 1500 మంది ఋత్వికులతో నిర్వహించిన అయుత మహా చండీయాగం ఒక ఆధ్యాత్మిక సంచలనాన్ని నమోదు చేసింది . ఆ యాగాన్ని చూసి తరించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు అప్పుడు తరలివచ్చారు .
పూర్వం రాజులు మాత్రమే అంత నిష్ఠతో యాగాలు చేసేవారని చరిత్ర చెబుతున్నది. మళ్లీ అంతే సంకల్ప బలంతో ఒక రాజకీయ నాయకుడిగా , పాలకుడిగా ఇప్పుడు తెలంగాణ రథసారథి కేసీఆర్ చేస్తున్నారని వేద పండితులు చెబుతున్నరు . ఇప్పుడు కూడా సుమారు 300 మంది ఋత్వికులతో ఈ నెల 21 నుండి 25 వరకు 5 రోజుల పాటు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సహస్ర మహా చండీ యాగాన్ని కూడా అంతే నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ విజయం సాధించారు . ఋత్వికులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయడంలో ముఖ్యమంత్రి వెన్నంటి ఉండే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ టీమ్ సక్సెస్ అయింది. ఈ 5 రోజుల యాగాన్ని చూడడానికి వచ్చిన ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలు , అధికారులు , నాయకులు అక్కడ ముఖ్యమంత్రి దంపతులు నిష్ఠతో పాల్గొన్న విధానం , పూజలు జరిగే తీరు చూసి ఆశ్చర్యపోయారు . “మాములుగా మనం ఇంట్లో అరుదుగా 2 గంటల పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికే ఆపసోపాలు పడుతుంటాం …
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 5 రోజులు అన్ని యాగ శాలల దగ్గర చాలా సమయం నిలబడి ఉండి కూడా పూజా కార్యక్రమాలు చేయాడం ఒక్క కేసీఆర్ కే సాధ్యమని‘’ కొంత మంది మాట్లాడుకోవడం ఆసక్తిగా గమనించాల్సిన విషయం. కేసీఆర్ ఏది చేసినా సంచలనమే . ఆయన వ్యవసాయం చేసినా , రాజకీయం చేసినా , ఉద్యమం చేసినా , పరిపాలన చేసినా , పుస్తకాలు చదివినా , ప్రజల గురించి మానవతా కోణంలో నిర్ణయాలు చేసినా , గంటల కొద్దీ అధికారులతో లోతుగా సమీక్షలు చేసినా … ఇలా ప్రతీ విషయంలోనూ కేసీఆర్ మార్క్ కనిపిస్తుంది . అయితే భక్తి విషయంలో ఆయన ఎంత నిష్ఠగా ఉంటరో రాజకీయంగా ప్రజల గురించి ఆలోచించే విషయంలోనూ అంతే చిత్త శుద్దితో కష్టపడతరు. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ఎంత లౌక్యంగా , ఒడుపుగా నడిపారో యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయం ఈ దేశంలో అందరికీ తెలుసు .
2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను చూసే ఎమ్మెల్యేలకు ఓట్లేశారు. 58 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వేర్లను పెకిలించి కేసీఆర్ కు పట్టం కట్టారు . ఆయన కూడా నిద్రాహారాలు మాని గంటల కొద్దీ సమీక్షలు చేసి తెలంగాణ బ్రాండ్ పథకాలను దేశం మొత్తం గుర్తించేలా , ప్రశంసల జల్లు కురిసేలా పాలన చేశారు . ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన 88 సీట్లతో చరిత్ర ను తిరగరాశారు . తను సృష్టించిన రికార్డులను తాను అధిగమించడమే కేసీఆర్ ప్రత్యేకత . ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సుమారు 6 వేల మంది సర్పంచులుగా గెలుపొందారు.మూడో విడత కూడా ఇదే ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది . ఈ సారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలోనూ టి ఆర్ ఎస్ 100 శాతం విజయాన్ని నమోదు చేయబోతున్నదంటూ జాతీయ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. కేంద్రంలో ఈ సారి టి ఆర్ ఎస్ ముఖ్యంగా కేసీఆర్ మార్క్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఆయన లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాని అయితే దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుందని అంచనా వేసే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది . ఏమైనా 5 రోజుల పాటు తెలంగాణ గడ్డ మీద అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన సహస్ర మహా చండీయాగం మంత్రోచ్ఛరణం తెలంగాణ ప్రజలకు , దేశ ప్రజలకు ఒక మంచి పాలన లభించే శుభ సూచకంగా అనిపిస్తున్నది .