ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం రాధాకు జగన్‌లో ఎటువంటి లోపాలు కనిపించలేదు. అవమానంగా అనిపించలేదు. కానీ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్లాలనే ఆలోచన రాగానే రాధా గొంతులో చెప్పలేని మార్పు వచ్చేసింది. జర్నలిస్టులను తిట్టే అహంకారం వచ్చింది.
ఇలాంటివి తెలుగుదేశంలో మాత్రమే కనిపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఏయ్, ఓయ్, ఆగు, విను, లెట్ మీ ఫినిష్ అంటూ ఊగిపోతున్న రాధాలో చంద్రబాబు కచ్చితంగా అందరికీ కనిపించారు. ఆపార్టీలోకి వెళ్తే తండ్రి ఆత్మ క్షోభిస్తుందన్న బాధ, జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాననే భయం, ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని మానసికస్థితిలో రాధా అలా ప్రవర్తించారనేది అక్షరసత్యం. జగన్ మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరించాడని రాధా చెప్పడంలోనే అది చంద్రబాబు స్క్రిప్టు అని అందరికీ అర్థం అవుతుంది. కారణం గత నాలుగున్నరేళ్లలో వైసీపీని వీడి టీడీపీ కండువాలు కప్పుకున్న ప్రతి ఒక్కరికీ జగన్ వ్యక్తిత్వంపై బురద జల్లడం తప్ప మరో కారణం చెప్పలేకపోయారు. టీడీపీ నా తండ్రిని పొట్టన పెట్టుకుంది అన్న మాటను ఉపసంహరించుకుని, టీడీపీకీ నా తండ్రి హత్యకూ సంబంధంలేదని రాధా చెప్పడంతో ఆయన పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
వైసీపీలో ఉన్నపుడు నన్ను అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు.. వాళ్లతో మాట్లాడు.. వీళ్లతో మాట్లాడు అంటూ జగన్ అన్నారని రాధా చెప్పడం నిజంగా అతని బద్ధకపు మనస్తత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత చెప్పిన విధంగా సభలు, సమావేశాలు నిర్వహించడం సమాలోచనలు చేయడం అనేది కనీస కర్తవ్యం కానీ అవే పెద్ద బాధ్యతలు, బాధలు అనుకున్న వ్యక్తులు రాజకీయాల్లో రాణించలేరు. అసలు ఈ నాయకుడు ఏడాదికి మూడుసార్లు ప్రజల్లోకి రావడమే పెద్ద బరువుగా ఫీలైపోతున్నారంటే ఈయన మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. రంగా కూడా నిత్యం పేద ప్రజలకోసం పోరాటాలు, నిరసనలతో ప్రభుత్వాన్ని కదిలించేవారు. జగన్ కూడా అదే పోరాట పటిమతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ రాధా చంద్రబాబు నాయుడు మాదిరిగా డబ్బు, కుల రాజకీయాలు చేస్తూ సుఖాలు అనుభవించాలనుకుంటున్నారని స్వయంగా బెజవాడ వాసులే తాజా ఘటనతో చెప్పుకుంటున్నారు.