నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు రవి చంద్రారెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వారి అనుచరులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ టీడీపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల చొప్పున చీల్చడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.. అయితే వీరంతా గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రత్యేకించి రవిచంద్రారెడ్డి టీవీ డిబేట్లలో మాట్లాడడంలో మంచి ఎక్స్ పర్ట్.. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల నిత్యం తెలుగుదేశం పార్టీ విధానాలను ఎండట్టేవారు.
కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు కారణంగా రవిచంద్రారెడ్డి డిబేట్లలో టీడీపీని విమర్శించలేకపోయారు. అయినప్పటికీ ప్రతీసారీ ఓటుకునోటు, రాజధానిలో దోపిడీ, టీడీపీ పాలనలోని అవినీతిపై ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపధ్యంలో ఆయనను కాంగ్రెస్ పెద్దలు వారించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. గతంలో జగన్ భార్య భారతి పేరు ఈడీ అటాచ్ చేసినపుడు కూడా రవిచంద్రారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అభిమాన నాయకుడు రాజశేఖరరెడ్డి కోడలిని మీడియా కూడా తప్పుబడితే సహించబోమని చంద్రబాబు అనుకూల మీడియాలోనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం రవిచంద్రా రెడ్డి వైఎస్సార్సీపీలో చేరడం వల్ల ఆపార్టీకి మరింత బలం చేకూరినట్టయ్యింది. వైఎస్ విధేయుడిగా పేరుగాంచిన ఈయన ఇకనుండి వైసీపీ తరపున టీవీ డిబేట్లలో వైసీపీ గళం పెద్దఎత్తున వినిపించనున్నారని స్పష్టమవుతోంది.