వంగవీటి రాధా ఇవాళ మాట్లాడిన మాటలపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను సూచించారు. జగన్ పై రాధా చేసిన వ్యాఖ్యలను ఉదయభాను ఖండించారు. రంగా ఎదుగుదలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎంతో ప్రోత్సహించారన్నారు. రంగాను హత్యా చేసే ముందు తాను కలిశానని, టీడీపీ గూండాలు బస్సులో వచ్చి రంగాను హత్యా చేశారన్నారు. ఇవాళ వంగవీటి రాధా విజయవాడలో మాట్లాడుతూ నా తండ్రిని చంపింది టీడీపీ కాదని, కొంతమంది వ్యక్తులు అని చెప్పడం రంగా అభిమానులు చాలా బాధపడుతున్నారని చెప్పారు.
రంగా హత్యా సమయంలో హరిరామజోగయ్య ఆనాటి కేబినెట్‌లో ఉండి పుస్తకంలో రాశారని, చంద్రబాబు హస్తం ఉందని, కోడెల శివప్రసాద్‌రావు ప్రమేయం ఉందని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్ వంగవీటి రాధాను ఓ తమ్ముడిలా చూసుకుంటానని, మీ తండ్రి మాదిరిగా నిన్ను మంచి నాయకుడిగా గుర్తిస్తానని చెప్పి పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. ఏడాది పాటు తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించలేకపోయారన్నారు. అందరి కన్నా రాధా అంటే జగన్‌కు ఓ ప్రత్యేకత, ప్రేమ ఉండేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనమని జగన్ సూచించారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాధాను నియమించినా ఆయన తన బాధ్యతలు సరిగా నెరవేర్చలేకపోయారన్నారు. విజయవాడ నగరంలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారని, సిటీ అధ్యక్షుడిగా ఉన్న రాధా నీ ఆత్మ సాక్షిగా ఆలోచించూ పార్టీ కార్యక్రమాల్లో ఎన్నిసార్లు పాల్గొన్నారో మీరే చెప్పాలన్నారు. రాష్ట్రంలో దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహాలను తొలగించారన్నారు. జగన్ ఎప్పుడూ ఇలాంటి చర్యలను క్షమించలేదని, చంద్రబాబు వంచనలపై ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. నీ తండ్రి రంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారని, నీవు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని వైయస్ జగన్ సూచించారన్నారు. తండ్రిని హత్య చేసిన టీడీపీలో చేరడం బాధాకరమన్నారు. రంగా ఆత్మ ఘోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. రంగా అభిమానులు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రాధా వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడుతున్నారని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని సూచించారు.