ఆపరేషన్ ఆకర్ష్.. గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్సీపీని కుదిపేసింది. అయినా ఆపార్టీకి ఉన్న చరిష్మా, జగన్ మొండితనం ముందు అవేమీ నిలబడలేదు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. వీరిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రాజ్యాంగబద్దంగా మొర పెట్టుకున్నా వినకపోవడంతో జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. చివరకు జగనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వని అసెంబ్లీకి గుడ్ బై చెప్పారు. దీంతోపాటు రాజకీయ పరిస్థితులు వేగంగా మారి పోయాయి. టీడీపీ-బీజేపీ విడిపోవడంతో ఏపీలో మరోసారి హోదా కావాలనే ఆకాంక్ష టీడీపీ సైతం తెరపైకి తెచ్చింది. కానీ ఇదే చంద్రబాబు గతంలో హోదా అంటే జైలుకు పంపుతా అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హోదా విషయంలో టీడీపీ నాలుగేళ్లు వ్యవహరించిన తీరు కూడా చంద్రబాబును తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని తిరిగి కాంగ్రెస్ తో కలుస్తుండడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలామంది టీడీపీ సీనియర్లు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీల మధ్య పోరు పెరిగింది. తాము గట్టిగా పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతున్నా నాలుగేళ్లుగా వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనించారు. వైసీపీ తొలి నుంచి హోదాకోసం చేస్తున్న పోరాటాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో ప్రజలకు ఎవరికి విశ్వసించాలో అర్ధమైంది. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నేతలు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు.
ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు వైసీపీ కండువా కప్పేసుకోవడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో అనంతపురం అర్భన్ నియోజవర్గ టీడీపీ నేత లింగాల రమేష్ సహా 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కాగా ఇటీవలే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, సాక్ష్యాత్తూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ పాదయాత్ర ముగిసిన నేపధ్యంలో రాజకీయ రంగు మొత్తం మారిపోయింది. జిల్లాలవారీగా మరికొందరు నేతలు వైసీపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి మాత్రం గట్టిగా వీస్తుందనే చెప్పుకోవాలి.