దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో ఆయన ట్విటర్ వేదికగా చాలామంది పేదలు ఆరోగ్యాలు పాడైతే వైద్యానికి ఆర్థికసాయం అందించారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిన ఓ వృద్ధురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కొరుట్లపేటకు చెందిన బాలవ్వ కుటుంబం కూలీపని మీదే జీవనం వెళ్ళదీస్తున్నారు. 13 ఏళ్ళ క్రితం బతుకుదెరువు కోసం గొల్లపల్లికి వచ్చి ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. నిత్యం కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల నుంచి బాలవ్వ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇక్కడే ఇంటి యజమానులు పైశాచికంగా ప్రవర్తించారు. ఆమె తమ ఇంట్లో చనిపోతే అరిష్టమని వెర్రిగా భావించి బాలవ్వను ఇల్లు ఖాళీ చేయించారు.
దీంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో గుడారం వేసుకొని తలదాచుకుంటున్నారు. అసలే చలికాలం కావడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం బాలవ్వ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. బాలవ్వ మృతివార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్పందించిన కేటీఆర్ చలించిపోయారు. వెంటనే బాధిత కుటుంబానికి సాయం అందించాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో సోమవారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ శ్రీకాంత్ బాలవ్వ అంతిమసంస్కారాల కోసం బాధిత కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థికసాయం అందించారు. కేటీఆర్ ఔదార్యానికి స్థానికులు జేజేలు పలుకుతున్నారు. బాలవ్వ కుటుంబానికి ప్రభుత్వం ఓ డబల్ బెడ్ రూం ఇల్లు కల్పించాలని కోరారు….