అత్యవసర సమయాల్లో, ఆపదలో ఆస్పత్రులకు చేరవేసే 108 అంబులెన్సులకు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా నేడు ప్రజా సేవకు దూరమవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు దాదాపు యాభై శాతం వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.టీడీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందని చెప్పాలి.కొన్ని నెలల క్రితం ప్రభుత్వం డీజిల్ బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాలు ఆగిపోయాయి.అత్యవసర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్ బిల్లులు చెల్లించకపోవడం, వాహనాలకు బ్రేక్ డౌన్ కారణంతో నిలిపివేశారని ఉద్యోగులు చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు మరో ఇబ్బంది వచ్చింది.వాహనాలకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది.గత పది రోజులుగా ఆక్సిజన్ సరఫరా ఇలా ఉందని తెలిసి పట్టించుకోలేదంటే ప్రభుత్వం పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర సమయంలో 108 వాహనం వస్తే ఎంత బాధలో ఉన్నవారికైనా ప్రమాదం తప్పిందనే భరోసా రోజురోజుకూ తగ్గిపోతుంది.
ప్రమాదంలో ఉన్నవారికి ఆక్సిజన్ ఎంతో అవసరం అలాంటిది ఇది అందుబాటులో లేకుంటే వారి పరిస్థితి ఊహించలేం. కానీ పది రోజులుగా జిల్లాలోని 108 వాహనాల్లో ఆక్సిజన్ నిండుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు లేకుండానే వాహనాలను నడిపేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 108 వాహనాలు ప్రజలకు ఎన్నో సేవలు అందించాయి. ఆపదలో ఉన్నట్టు సమాచారం వస్తే చాలు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని సేవలు అందించేది. అలాంటి వాహనాలు నేడు ఉపయోగం లేకుండా పోయాయి.శ్రీకాకుళం జిల్లాలో వీటి సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.పది రోజులుగా 108 వాహనాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదాలకు గురైన వారు,ఇతర అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయాలు బయటకు రానీయకుండా ఆ శాఖ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. సమాచారం ఎవరికీ చెప్పవద్దని హుకం సైతం జారీ చేసినట్టు తెలిసింది.