నలుగురిని ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన ఓ మహామనిషి వృత్తి జీవితం తెలుగురాష్ట్రాలలో ముగియనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుధీర్ఘకాలం సేవలందించిన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బదిలీకి రంగం సిద్దమైంది. ఈయన స్థానంలో కిరణ్ బేడీ పేరు కేంద్రం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారి గవర్నర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో బాజపా కూడా ఇప్పటి వరకు బదిలీల విషయంలో అడుగులు వేయలేక పోయింది. దానికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు ఆయన అనుకూలంగా లేకపోవడంతో బాజపా కూడా ఈ విషయంలో పెద్దగా ఆలోచన చేయలేదు.
అయితే ఒకవైపు లోకసభ ఎన్నికలు సమీపిస్తుండగా… భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశలో తమకు అత్యంత నమ్మకస్తులైన వారి కోసం గత వారం రోజులుగా కేంద్రం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ వర్గాలలో కిరణ్ బేడీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నియమించిన గవర్నర్లు అందరూ బదిలీ అయినప్పటికీ ఒక్క నర్సింహన్ మాత్రమే భాజపా ప్రభుత్వంలోనూ సేవలందించగలిగారు.ప్రస్తుత తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సేవలను కేంద్రం మరో రూపంలో ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా తెలుగు రాష్ట్రాల మహా ప్రస్థానంలో గవర్నర్ నరసింహన్ సేవలు అభినందనీయం.
సుధీర్ఘ కాలం..:
దైవభక్తి కలిగిన 76 ఏళ్ళ గవర్నర్ నర్సింహన్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ గా పనిచేశారు. నరసింహన్ కొత్త తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంత సుధీర్ఘ కాలం పనిచేసిన నర్సింహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో సంయమనంతో వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఓటుకు నోటు, జోనల్ వ్యవహారం, నీటి పారుదల విషయాలపై సమస్యలు ఎదురైనప్పుడు చురుగ్గా, లౌక్యంతో వ్యవహరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నియమితులైన గవర్నర్ నర్సింహన్ భాజపా ప్రభుత్వ హయంలో కూడా తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగడం విశేషం. దేశంలో ఎన్డీ తివారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ఓ రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా ఎన్డీ తివారీ వివాదాస్పద రీతిలో వైదొలిగిన తర్వాత వచ్చిన నర్సింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు సుధీర్గంగా సేవలందించడం గమనార్హం.
గవర్నర్ పయనమిది:
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగు మాట్లాడే వారు ఇక అధికారికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా వేరయ్యారు. కాగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కొత్త రాష్ట్రాలకు తొలి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఇలా నరసింహన్ హయాంలో విభిన్న పార్టీల ప్రభుత్వాలు ఏర్పడం.. నలుగురు ముఖ్యమంత్రులు (అదనంగా కేసీఆర్ రెండుసార్లు) పనిచేయడం మరో విశేషం.
2007లో ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమితులైన నరసింహన్.. 2009 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ (మునుపటి) గవర్నర్ ఎన్.డీ.తివారీ రాజీనామా చేయడంతో ఇక్కడకు బదిలీ అయ్యారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, రాష్ట్రపతి పాలన వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సమర్ధంగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా పరిపాలన స్తంభించకుండా చురుగ్గా వ్యవహరించారు. పెట్రోలు బంకుల డీలర్లు సమ్మె చేసినప్పుడు ఆయన కలగజేసుకున్న గంటలోపే వాళ్లు సమ్మె విరమించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కీలకంగా పనిచేశారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడే నరసింహన్ 1946లో తమిళనాడులో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్ర్రంలో డిగ్రీ, పొలిటికల్ సైన్స్ లో పీజీ, లా చేశారు. అనంతరం ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారిగా పనిచేశారు. ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా సుదీర్ఘకాలం బాధ్యతలు చేపట్టారు.
నరసింహన్ ప్రొఫైల్:
వయసు: 76
స్వరాష్ట్రం: తమిళనాడు
విద్యాభ్యాసం: ఫిజిక్స్ లో డిగ్రీ, పొలిటికల్ సైన్స్ లో పీజీ, లా
ఐపీఎస్ కు ఎంపిక: 1968 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కేడర్
1981-84: మాస్కో ఎంబసీలో తొలి కార్యదర్శి.
2006 వరకు: ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా పదవీ విరమణ
2007 జనవరి 19: చత్తీస్ ఘఢ్ గవర్నర్ గా నియామకం
2009 డిసెంబర్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు
2014 జూన్ 2: తెలంగాణ తొలి గవర్నర్ గా ప్రమాణం (అదనపు బాధ్యతలు)