వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టుముందు పెట్టాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలని చూసిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.