‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది.
అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన వారి సంఖ్యతో కలుపుకొంటే మొత్తం ఖాళీలు 2.40 లక్షలకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి.అయితే ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించి ప్రభుత్వం ఇప్పటి వరకూ భర్తీ చేసిన పోస్టులు.. కేవలం రెండు వేలు మాత్రమే ఆ తరువాత 2016 వరకు వాటి వరకు వాటి ఊసే ఎత్తలేదు.ఇక గ్రూప్–1, 2, 3తో పాటు కొన్ని సాంకేతిక పోస్టులు, ఇతర పోస్టులు కలిపి మొత్తం 4,275 ఖాళీల భర్తీకి మాత్రమే 2016లో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి 15.99 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు.
ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో కేవలం 2 వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించడాన్ని బట్టి చూస్తే నిరుద్యోగులను చంద్రబాబు ఏవిధంగా వంచించారో అర్థమవుతుంది.అయితే రాష్ట్రంలో ఇంకా 22 వేలకు పైగా టీచర్ ఖాళీలు భర్తీ చేస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించినప్పటికీ చివరకు ఆ పోస్టుల సంఖ్యను 7,902కు కుదించేసింది.అవిగో నియామకాలు, ఇవిగో వేలాది పోస్టుల భర్తీలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం రెండు వేలు మాత్రమే.తమ ఆశలతో, ఆశయాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు, ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 1.5 లక్షల మందిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. కుక్‌లు, సహాయకులు 80 వేల మంది,20 వేల మంది వయోజనవిద్య సమన్వయకర్తలు,25 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరినీ చంద్రబాబు సర్కార్ అన్యాయంగా తొలగించి రోడ్డున పడేసింది.