హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వరకు అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ సదస్సు జరగనుంది. 19వ తేదీన ప్రారంభ సమావేశానికి అన్నా హజారే ముఖ్య అతిథిగా హాజరవుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీనోట్ అడ్రస్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జరిగే ముగింపు సమావేశానికి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. శనివారం ఎంపి కవిత సదస్సులో పాల్గొనాలని రాజ్‌భవన్‌కు వెళ్లి ఆహ్వానించారు.
మొదటి రోజు యువత అభివృధ్ధి పై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్టిని నిర్వహిస్తారు. పది వేర్వేరు హాళ్లలో వేర్వేరు అంశాలపై చర్చా గోష్టులు జరుగుతాయి. ప్రంపచ ప్రగతిలో యువత పాత్రపైనా యువ నాయకులు మాట్లాడతారు. రెండో రోజు నైపుణ్య శిక్షణ, సమతులాభివృద్ధిలో యువత, మహిళల పాత్ర, కార్పోరేటు,ప్రభుత్వాల భాగస్వామ్యం పై చర్చిస్తారు. వీటిని అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో నిష్టాతులు నిర్వహిస్తారు.
గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు అంశంపై సదస్సులో చర్చిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 2030 వరకు భవిష్యత్ మానవాళి మనుగడకు అవసరమైన ప్రాథమిక లక్ష్యాలను సాధించేందుకు ఐక్యరాజ్య సమితి విడుల చేసిన 17 అంశాల లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంతర్జాతీయ సదస్సు ను నిర్వహిస్తున్నదని ఆమె వివరించారు. 103 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని ఎంపి కవిత చెప్పారు.
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 లక్ష్యాలు:
1. పేదరిక నిర్మూలన
2. ఆహార సమృద్ది
3. ఆరోగ్యం
4. నాణ్యమైన విద్య
5. లింగ సమానత్వం
6. మంచి నీరు-పరిశుభ్రత
7. పర్యావరణ అనుకూల విద్యుత్
8. గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి
9. పరిశ్రమలు, మౌళిక వసతులు, నూతన ఆవిష్కరణలు
10. అన్ని రంగాల్లో సమానత్వం
11.పర్యావరణ అనుకూల నగరాలు, గ్రామాలు
12. బాధ్యతాయుతమైన వనరుల వినియోగం
13.వాతావరణంలో మార్పులు-మానవాళి బాధ్యత
14. సముద్ర జీవుల సంరక్షణ
15. భూచరాల జీవనానికి అనుకూల వాతావారణంకు కృషి
16. శాంతి, న్యాయం దిశగా పటిష్ట వ్యవస్థల ఏర్పాటు
17. పై లక్ష్యాల కోసం వ్యవస్థలు, దేశాల పరస్సర సహాకారం