పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్.. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పార్టీల నేతలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తారా అని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ క్యాండిడేట్ గా గోకరాజు గంగరాజును బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన వంకా రవీంధ్రనాధ్ గోకరాజు గంగరాజుపై ఓడిపోయారు. అనంతరం వంకా రవీంధ్రనాధ్ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ పాల్గొంటున్నా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంపై ఎక్కువగా ఆసక్తి చూపలేదు. అక్కడి నియోజకవర్గ ఇన్ చార్జ్ లు నరసాపురం ముదునూరి ప్రసాదరాజు, భీమవరం గ్రంధి, ఆచంట శ్రీరంగనాధ రాజు, ఉండి పీవీఎల్, పాలకొల్లు గుణ్ణం నాగబాబులే అన్ని బాధ్యతలు చూసుకున్నారు.
తాజాగా ఆపార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఎంపీ అభ్యర్ధిపై క్లారిటీ ఇస్తారని భావించినా జగన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ పాదయాత్ర ఆసాంతం జిల్లా సీనియర్ నాయకుడు, అప్పటికే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన వైఎస్ కుటుంబ విధేయుడు గాదిరాజు సుబ్బరాజు ప్రజాసంకల్ప యాత్రలో కీలక పాత్ర పోషించారు. గోదావరి జిల్లాల్లోనే బలమైన క్షత్రియ సామాజికవర్గంతోపాటు ప్రస్తుత తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధి, ప్రముఖ వ్యాపారవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజుకు ధీటైన అభ్యర్ధి కావటంతో గాదిరాజు సుబ్బరాజును దింపనున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.
2014 కంటే రాజకీయ సమీకరణాలు మారిన నేపధ్యలోం టీడీపీ, బీజేపీ పార్టీలు విడివిడిగా పోటీ చేసినా, అలాగే జనసేన తరపున ఎవరైనా అభ్యర్ధిని దింపినా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకుతో వైసీపీ ఎంపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న సర్వేల నేపధ్యంలో ఇక్కడి వైసీపీ ఎంపీగా అభ్యర్ధిగా గాదిరాజును ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.. పార్టీ అధినైత వైఎస్ జగన్ కూడా గాదిరాజు పట్లే సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా గాదిరాజు మరికొద్దిరోజుల్లో ప్రచారానికి దిగినా ఆశ్చర్యం లేదంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.