వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ సాధారణ భక్తుల మాదిరిగా వెళ్లిన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని, పాదయాత్రలో జగన్ ను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు.
కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన వైఎస్ జగన్ను వైజాగ్లో స్వామివారే కాపాడి నేడు తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎప్పుడు సామాన్యునిలానే ఉంటారని.. చంద్రబాబులా ప్రజలను చూసి విసుగు చెందరని తెలిపారు. వైఎస్ జగన్ సామాన్యునిలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.