2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై టీడీపీ నేతలు రాసిన లేఖను నాని ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్ జగన్ అని, చంద్రబాబులా అధికారంకోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. 2017 నవంబర్6న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రారంభించిన పాదయాత్ర 14 నెలలపాటు సాగిందని, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వచ్చిన ప్రజాదరణ చూసిన టీడీపీ నేతలు మతి తప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి లేడని విమర్శించారు. 2004 కంటే ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ ఒక్క వర్గానికి మేలు చేయకపోవడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
గతంలో వైయస్ఆర్ సీఎం అయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిందన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఆశ్రయం కల్పించారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు నింపారన్నారు. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి జగన్ను జైలుకు పంపించినా ధృఢ సంకల్పంతో ముందుకు సాగారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాను ఎదురించారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఆయన్ను దించడం సాధ్యంకాదని చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి లేడని స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు దిగిపోతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. చంద్రబాబే పెద్ద సైకో అని నాని విమర్శించారు.