గులాబీ దలపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనతో ఇప్పటికే దేశం చూపును తనవైపు తిప్పుకొంటున్న తెలంగాణ రాష్ట్రం మరో గొప్ప నిర్ణయం ద్వారా తన గొప్ప మనసు చాటుకుని.. ఉత్తమంగా నిలిచింది. అవయవాదానాల విషయంలో వివిధ రాష్ర్టాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది.
తెలంగాణలో 2018 సంవత్సరంలో 160 మంది బ్రెయిన్‌డెడ్ పేషెంట్ల నుంచి కీలక అవయవాలు సేకరిస్తే.. రెండోస్థానంలో తమిళనాడు (140), మూడో స్థానంలో మహారాష్ట్ర (135), నాలుగో స్థానంలో కర్ణాటక (90) నిలిచాయి. గతంలో ఈ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంటే.. ఈసారి తెలంగాణ మొదటిస్థానానికి ఎగబాకింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు పెరుగుదల సాధించాయి. తమిళనాడు, కేరళలో అవయవ దానాలు తగ్గుముఖం పట్టాయి.
మనిషి చనిపోయాక సాధారణంగా ఆయా మత, కుల విశ్వాసాలకు అనుగుణంగా భౌతికకాయాన్ని దహనం లేదా ఖననం చేస్తుంటారు. కానీ, అటువంటివారి నుంచి నేత్రాలు దానంచేస్తే ఇద్దరికి కంటిచూపు ప్రసాదించవచ్చు. అదే బ్రెయిన్‌డెడ్ వంటి కేసుల్లో అయితే నేత్రాలతోపాటు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలువంటివి సేకరించి, సదరు అవయవాలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సరైన సమయంలో అమర్చగలిగితే వారికి కొత్త జీవితం ప్రసాదించవచ్చు. ఇవేకాదు.. జీర్ణకోశం, చేతులు, పేగులు, చర్మం, ఎముకలువంటివి ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో సదరు బ్రెయిన్‌డెడ్ మృతుని బంధువులను ఒప్పంచడం కీలకంగా ఉంటుంది. అత్యంత ప్రీతిపాత్రులను కోల్పోవటం తీర్చలేని లోటే. కానీ, సదరు వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో మరో నలుగురికి కొత్త జీవి తం బహూకరించినట్టు అవుతుంది. కీలక అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోవడమో లేక బూడిదగా మిగులడమో కాకుండా.. మరో నలుగురికి ప్రాణంపోయగలిగే ఈ జీవనదానం సమకాలీన పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారింది. ఇందులో తెలంగాణ అగ్రభాగాన నిలువడం గమనార్హం.