సీబీఐలో కలకలం చోటుచేసుకుంటోంది. చీఫ్ చైర్‌లోకి వచ్చిన రెండో రోజే అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు సీబీఐ అధికారులను బదిలీ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు సీబీఐ అధికారులు అజయ్ భట్నాగర్, ఎంకే సిన్హా, తరుణ్ గౌబా, మురుగేసన్, ఏకే శర్మను బదిలీ చేస్తూ ఆర్డర్లు పాస్ చేశారు అలోక్. ఆయన మళ్లీ సీబీఐ చీఫ్‌గా చేరిన మొదటి రోజే 10 మంది సీబీఐ ఆఫీసర్ల బదిలీల కోసం తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ పాస్ చేసిన ఆర్డర్లను రద్దు చేశారు. వాళ్లను అదే టీమ్‌లో కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ ఐదుగురు అధికారులను బదిలీ చేశారు.
అయితే.. అలోక్ తీసుకుంటున్న నిర్ణయాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష పార్టీ లీడర్‌తో కూడిన హై పవర్ సెలెక్షన్ కమిటీ సీబీఐ చీఫ్ అధికారాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయనకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదంటూ సుప్రీం కోర్టు తెలిపింది. అయినప్పటికీ.. ఆయన సంచలన నిర్ణయాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే అలోక్‌ను హైపవర్ కమిటీ తొలగించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా అలోక్ ను నియమిస్తున్నట్టు హైపవర్ కమిటీ తెలిపింది. అలోక్ వర్మ తొలగింపును ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రీ సమర్థించగా.. లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. అయినప్పటికీ.. 2-1 మెజార్టీతో హైపవర్ కమిటీ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది.