ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోనేత టీడీపీకి షాకిచ్చారు. ప్రభుత్వం విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని, ఇంకా చాలమంది బీసీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివంగత వైఎస్సార్ హయాంలోనే బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేస్తామని జగన్ హామీ ఇచ్చారని, బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తారని అన్నారు.
