ప్రజాసంకల్పయాత్ర… జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది.పెనుసంచలంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసంకల్పయాత్రతో జిల్లాలో తన పునాదులను మరింత బలోపేతం చేసుకుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులే కాదు..క్షేత్ర స్థాయి అధికారులు కూడా ఎప్పుడు కన్నెత్తి చూడని విధంగా జననేత సాగించిన పాదయాత్రతో పార్టీలకతీతంగా అన్ని సామాజిక వర్గాల నుంచి వెల్లువెత్తిన మద్దతు అధికార టీడీపీలో గుబులు రేపింది.
జిల్లాలో ముందుకు వెళ్లేకొద్ది మేమున్నామంటూ జనం ముందుకొస్తుంటే..ఈ సంకల్పంలో తామూ కూడా చేరాలని రాజకీయ నాయకులు, అధికారులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వారూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పోటీ పడ్డారు.నిన్నటివరకూ బ్యూరోక్రసీలో కీలక స్థానాల్లో ఉండి సేవలందించిన వారు సైతం జగన్‌తో కలిసి పని చేయడానికి ఉత్సాహపడుతున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశాఖ మాజీ ఎంపీ దివంగత నేదురు మల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్ కుమార్‌తో పాటు మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిలతో సహా పలువురు కీలకనేతలు వందలాది మంది శ్రేణులతో కలిసి విశాఖలోనే పార్టీలో చేరారు.
ఉన్నత ఉద్యోగాలను వదిలికొని కొందరు..రిటైరైన ఉద్యోగులు మరికొందరు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇంటిలిజెన్స్ డీఐజీ ఏసురత్నం ఏకంగా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వందలాది మంది అభిమానులతో కలిసి పెందుర్తి సమీపంలో జననేత సమక్షంలో పార్టీలో చేరారు. అదే విధంగా మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు వందలాది మంది అభిమానులతో కలిసి పాయకరావుపేటలో పార్టీలో చేరారు.
వెన్నెలపాలెం రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ అధికారి వెన్నెల నరసింహారావు, విశాఖ ఎన్జీవో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు కూడ కృష్ణారావు, హుకుంపేట బ్లాక్ డెవలప్ మెంట్ అధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, ట్రైబల్ ఇన్ఫోటిక్ ప్రయివేట్ లిమిటెడ్ చైర్మన్ కుర్రబోయిన సింహాచలం, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఎండవ నిర్మలాకుమారి, జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్‌యూనియన్ సెక్రటరీ జనరల్ వి.వి.వామనరావు ఉన్నారు. అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలో చేరిన వారిలో విశాఖ నగరానికి చెందిన కళా ఆస్పత్రి ఎండీ డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి, విశాఖ నందమూరి కల్చరల్ యూత్ అధ్యక్షుడు విశ్వనాథ శ్రీనివాసరావు, నాయీ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర మాజీ గౌరవ అధ్యక్షుడు ఆరిపాక పెంటారావు తదితరులు ఉన్నారు.ఇలా ఎంతో మంది నాయకులు,ఉద్యోగులు ప్రజలు సైతం జగన్ వెంటే నడవాలనుకుంటున్నారు.