తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్‌స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు.
ఎన్టీఆర్‌నే మోసం చేసిన చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకేమి చేస్తారు? అని మోడీ ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఎప్పటికీ క్షమించలేదని, అలాంటి కాంగ్రెస్‌తో జత కలిసి ఏపీ సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు రెండోసారి వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఏపీలో కుల రాజకీయాలు, అవినీతిని అంతమొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా విఫలమైన చంద్రబాబు దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవాచేశారు.
ఏపీలో శాంతిభద్రతలు సరిగా లేవని, కాకినాడలో బీజేపీ మహిళా కార్యకర్తపై సీఎం చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా.. నాయకులు ఎప్పుడైతే సహనం కోల్పోయి ఎదుటివారిపై దాడులకు దిగుతారో.. వారికి ఓటమి భయం పట్టుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. దాడులకు పార్టీశ్రేణులు భయపడాల్సిన పనిలేదని, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు బీజేపీ సొంతమనిమోడీ పేర్కొన్నారు.