ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర ప్రభుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే తప్ప వాటికి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నరేంద్రమోడీ బీజేపీకే ప్రధాని అనుకుంటున్నారా? బీజేపీ పాలిత రాష్ర్టాలకే ఆయన ప్రధానమంత్రా? అంటూ నిప్పులు చెరిగారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలపట్ల ఒక తీరుగా, బీజేపీయేతర ప్రభుత్వాలపట్ల మరోతీరుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు అడుగగానే అంచనా వ్యయంలో 25% భరించడానికి కేంద్రం ముందుకొచ్చిందని, ఇప్పటికే రూ.3831 కోట్లు విడుదలచేసిందని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌గడ్కరీ ఆ రాష్ర్టానికి నిధులు ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చారని, 90% నిధులు కేం ద్రమే విడుదలచేస్తున్నదని గుర్తుచేశారు. కానీ.. తెలంగాణలో కాళేశ్వరంసహా దేనికైనా ఒకదానికి జాతీయహోదా కోరుతుంటే ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రం అన్ని రాష్ర్టాలను సమదృష్టితో చూడాలని కోరారు.
మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు నిధులు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి నీతిఅయోగ్ సిఫార్సుచేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయితే నిధులను ఇచ్చేదిలేదని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి తెలిపారన్నారు. బీజేపీ బలంగా లేని తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఇంటింటికీ నల్లానీటిని అందించే మిషన్‌భగీరథ మంచి కార్యక్రమమంటూ ప్రశంసించారని, ఆయనే స్వయంగా గజ్వేల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారని కేటీఆర్ ప్రస్తావించారు.
ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, మంత్రులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి ప్రశంసించారని చెప్పారు. ఈ పథకం బాగుందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్‌సత్యార్థి, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్ సహా పలువురు ప్రముఖులు అభినందించారని కేటీఆర్ చెప్పారు. ఒక వైపు రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రశంసిస్తూ మరోవైపు ఆ పథకాలను కాపీ కొట్టి, పేరు మార్చి అమలుచేయడంద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీ తాపత్రయపడుతున్నదని విమర్శించారు.