ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని ప్రముఖ సర్వే సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే సంస్థ తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనకంటే నాలుగున్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలన మెరుగ్గా ఉన్నదని ప్రజలంతా ఆనందంగా అంగీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటిన్నరకుపైగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేరడంతో సీఎం కేసీఆర్ నాయకత్వానికే జైకొడుతున్నారు.
వీడీపీ అసోసియేట్స్ చేసిన సర్వేలో టీఆర్ఎస్కు దాదాపు 44.4 శాతం ఓట్లు పోలవుతాయని వెల్లడించింది. 2014 ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్కాజిగిరిలో టీడీపీ నుంచి గెలిచిన చామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. దీంతో లోక్‌సభలో టీఆర్ఎస్ బలం 14కు పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌కు 31 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేల్చిన సర్వే.. ఒక్కసీటు కూడా గెలిచే అవకాశమే లేదని పేర్కొన్నది. తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించిన బీజేపీ 11.4 శాతం ఓట్లను పొందుతుందని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన సికింద్రాబాద్ స్థానాన్ని ఈసారి కోల్పోయి చతికిలపడే అవకాశమున్నది.
హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకొనే ఆనవాయితీని ఎంఐఎం ఈసారి కూడా కొనసాగిస్తుందని తెలిపింది. మజ్లిస్‌కు ఈసారి దాదాపు 4 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల చిరునామా గల్లంతయ్యే అవకాశమున్నదని వీడీపీ తాజా సర్వేలో పేర్కొన్నది. సీపీఐ, సీపీఎంకు చెరో 0.5 శాతం, కోదండరాం పార్టీ టీజేఎస్‌కు 0.4 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ప్రతిపక్షాలు కూకటివేళ్లతోసహా కుప్పకూలనున్నాయని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.