తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. ఇక ఏపీలో ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది.
హోదా ఇవ్వగలిగే స్థానంలో ఉండి ఇవ్వకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడిన దానిని స్వాగతించాలి. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ముందుకు రావడం హర్షణీయం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాటం చేసి కేసీఆర్ గెలిచారు. గత ఐదేళ్లలో కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీతో ఎక్కడా సంసారం చేయలేదు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని.. కలిసి పోటీ చేద్దామని కేటీఆర్‌తో చంద్రబాబు మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఒప్పుకున్నారు.
చంద్రబాబుకు ఓటేయమని పవన్ కల్యాణ్ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు, బీజేపీ, పవన్ ముగ్గురికి పాత్ర ఉంది. మేం గతంలో ఎవరితోను పొత్తు పెట్టుకోలేదు.. ఈ సారి కూడా ఎవరితోను పొత్తు పెట్టుకోము. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం ఉంది అన్నారు. ఇప్పటికీ చాలాసార్లు మోసపోయాం. నేను ఏపీ ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇస్తాం.. ఇస్తాం.. అని చెప్పి చాలా మంది మోసం చేశారు. కాంగ్రెస్ చేస్తామని చేయలేదు.. పవన్, మోదీ వచ్చి అదే మోసం చేశారు. అందుకే ఏపీ ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే స్థితిలో లేరు. 25 మంది ఎంపీలను మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ఎవరు హోదాకు సంతకం పెడతారో వారికే మద్దతిస్తామన్నారు.