‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం.
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్‌తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగన్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్‌ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతో జతకట్టిన చంద్రబాబు.. వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు అని మా పై విమర్శలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం రాలేదు. కానీ వడ్డీలు కట్టమని నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు.