త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పాదయాత్రలో ఎదురైన అనేక అనుభవాలతో పాటు రాజకీయాలు, తానిచ్చిన హామీలు, అధికార పార్టీ వైఫల్యాల వంటి అనేక విషయాలెన్నింటినో ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంలోని ఆంతర్యాన్ని విడమరిచి చెప్పారు. చంద్రబాబు నాయుడు చవకబారు రాజకీయాలను ఎండగట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రత్యేకహోదా విషయంలో మాటమార్చడం, నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి అధికారం పంచుకుని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తో కలిసి కాపురం చేయడం వంటి చంద్రబాబు ద్వంద వైఖరులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఏపీలో చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు.