రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు, ఏపీలో చోటుచేసుకున్న అవినీతిని వైసీపీ నేతలు ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 7 వరకూ ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం కొనసాగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు నుంచి ప్రతీ నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో ప్రత్యేక స్టిక్కర్లను పార్టీ శ్రేణులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ”నిన్ను నమ్మం బాబు” పేరుతో సాగే ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్లి చంద్రబాబు వైఫల్యాలను వివరించడంతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను వివరించనున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను నియోజకవర్గ ఇన్చార్జ్లు మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని వైసీపీ చెబుతోంది.
